డోర్లు లేక, లైట్లు లేక, పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయని స్థానికుల ఆరోపణలు
సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని స్థానిక నాయకులు బూడిద సమ్మయ్య ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్, వెంకట్రావుపల్లి, కే.కే. నగర్ ప్రాంతాల్లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సులభ్ మరుగుదొడ్లు దుస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మరుగుదొడ్లకు సరైన డోర్లు లేకపోవడంతో సందుల నుంచి పాములు, విషపురుగులు లోపలికి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, లైట్లు లేకపోవడం, పైకప్పు పెచ్చులు ఊడి పడటం, మరుగుదొడ్ల బేసిన్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయని వివరించారు.
ఈ సమస్యలపై స్థానికులు ఎన్నిసార్లు సివిల్ డిపార్ట్మెంట్ డీజీఎంకు, సిబ్బందికి విన్నవించుకున్నా వారు స్పందించడం లేదని, మరమ్మత్తులు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని బూడిద సమ్మయ్య ఆరోపించారు. ప్రజలకు అత్యవసరమైన ఈ మరుగుదొడ్ల మరమ్మత్తులపై సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.












