గోదావరిఖని, 21 October
కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన చలో హైదరాబాద్ మహాధర్నా వాల్ పోస్టర్లను రామగుండం-2 ఏరియాలోని ఓసిపి-3 కృషి భవన్లో పిట్ కమిటీ నాయకులు, కార్మికుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మన హక్కులను సాధించుకోవడానికి కార్మికులందరూ కదలిరావాలని పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఈ మహాధర్నా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రతీ కార్మికుడికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత మరియు సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాలు వచ్చే విధంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలను నిలిపివేసి, వాటిని పరిరక్షించుకోవాలని, సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఈ రెండు రోజుల మహాధర్నా ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
మొదటి రోజు - ఆదివారం నాడు పారిశ్రామిక రంగ కార్మికులు, ప్రైవేట్ పరిశ్రమల కార్మికులు, సింగరేణి, ఆర్.టి.సి, విద్యుత్ ఉద్యోగులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, రెండో రోజు - సోమవారం నాడు స్కీమ్ వర్కర్లు (అంగన్వాడీ, ఆశా, మిడ్-డే మీల్స్ మొదలైనవి), భవన నిర్మాణ రంగ కార్మికులు, హమాలీలు, బీడీ వర్కర్లు, మున్సిపల్, మెడికల్ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పెన్షనర్లు మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని తమ నిరసన తెలపనున్నారని తెలిపారు. ఐక్యపోరాటాలతోనే హక్కుల సాధన జరిగి ప్రభుత్వాలు దిగివచ్చేలా, కార్మికవర్గ ఐక్య శక్తిని చాటేలా ఈ మహాధర్నాలో కార్మికులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నరసాంబరావు, రాంప్రసాద్, వినేష్తో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












