నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 2 వ డివిజన్ జంఘాల పల్లిలో శుక్రవారం డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వానికి స్థలం అవసరం ఏర్పడటంతో, పవర్ హౌజ్ కాలనీలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 62 మంది లబ్ధిదారులకు స్థలం కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంగళ బాపు, కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు, ముస్తఫా, నాయకులు కాల్వ లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.












