అమరులైన పోలీసు కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది: డీసీపీ
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సర్కిల్ పరిధిలోని , జూలపల్లి, ఎలిగేడు, పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీఐ పొన్నమనేని రంజిత్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని తెలంగాణ చౌరస్తా వద్ద డీసీపీ బి. రామ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం నిత్యం విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు ఎంతో గొప్పవని అన్నారు. విధి నిర్వహణలో పోలీసుల ప్రాణత్యాగం బాధాకరమని, అమరులైన పోలీసు కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
సైకిల్ ర్యాలీ తెలంగాణ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం, సివిల్ ఆసుపత్రి, శివాలయం, పాత జెండా, పోలీస్ స్టేషన్, రాజీవ్ రహదారి మీదుగా పూసాల ఎక్స్ రోడ్, వివేకానంద స్కూల్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి తెలంగాణ చౌరస్తాకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్, గట్ల సుధాకర్, సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మండల పాత్రికేయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












