పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో రానున్న 15 రోజులు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, పట్టణాల్లో సంపూర్ణ పరిశుభ్రత సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం అనంతరం పట్టణాల్లో ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం, రోడ్లపై మురుగునీటి నిల్వలు కనిపించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రానున్న 15 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పారిశుధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, రోడ్లు, వీధులు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించాలని తెలిపారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక డ్రైవ్ అనంతరం పట్టణాల్లో సంపూర్ణ పరిశుభ్రత కనిపించాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత
సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి వృథాను తక్షణమే అరికట్టాలని ఆదేశించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో నీటి సరఫరా పైప్లైన్ల లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీటి వృథా నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నీటిని వృథా చేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని తెలిపారు.
రానున్న రెండు నెలల్లో మున్సిపాలిటీల పరిధిలో పన్నుల వసూళ్లను గణనీయంగా పెంచాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పన్నుల వసూళ్లు చేపట్టాలని, వసూళ్ల పురోగతిని నిరంతరం సమీక్షించాలని సూచించారు.
అక్రమ నిర్మాణాలపై నిఘా
పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా అనధికార నిర్మాణాలు జరగకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు.
నిధులతో పాటు ఇతర గ్రాంట్ల కింద ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపాలిటీల పరిధిలోని డంప్ యార్డుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చెత్త సేకరణ, తరలింపు, నిర్వహణ ప్రక్రియలను పకడ్బందీగా చేపట్టాలని, డంప్ యార్డుల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.












