గోదావరిఖని/పెద్దపల్లి,అక్టోబర్03 (అక్షర జ్యోతి) అక్టోబర్ 03
అపెక్స్ జేసీసీలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఏకగ్రీవ నిర్ణయం
బొగ్గు గని కార్మికులకు ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా చెల్లించనున్న పనితీరు ఆధారిత బోనస్ (పి.ఎల్.ఆర్)ను రూ.1,10,250గా నిర్ణయించినట్లు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్సీఎంకేఎస్బిఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి తెలిపారు. శనివారం జరిగిన అపెక్స్ జాయింట్ కమిటీ (జెసిసి) సమావేశానికి బీఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి హాజరయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో బొగ్గు పరిశ్రమలోని కార్మికులకు 2026 సంవత్సరానికి దీపావళి పి.ఎల్.ఆర్ బోనస్‌గా రూ.1,10,250 చెల్లించేందుకు నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు.
బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం బీఎంఎస్ నిరంతరం పోరాటం చేస్తోందని, కార్మిక సంఘాల ఐక్యతతోనే ఈ స్థాయిలో పి.ఎల్.ఆర్ సాధించగలిగామని వడ్డేపల్లి కుమారస్వామి అన్నారు. ఈ పి.ఎల్.ఆర్ సాధనలో ఐఎన్టీయూసీకి ఎలాంటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల ప్రయోజనాల కోసం బీఎంఎస్ చేసిన నిరంతర కృషిని కార్మికులు గుర్తించాలని కోరారు. దీపావళి సందర్భంగా బొగ్గు గని కార్మికులకు రూ.1,10,250 బోనస్ లభించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.












