ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.60,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం
గోదావరిఖని, పెద్దపల్లి (అక్షరజ్యోతి ప్రతినిధి): సింగరేణిలో కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను చెల్లించాలని, ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయిపడిన సుమారు 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆర్జి-2 పరిధిలోని వకీల్ పల్లి గనిలో యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. ఆర్జి-2 బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మామిడి మహేందర్ ఆధ్వర్యంలో, వకీల్ పల్లి పిట్ సెక్రటరీ రోహిత్ రెడ్డి అధ్యక్షతన ఈ వినతిపత్రాన్ని యాజమాన్యానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జి-2 బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు విచ్చేసి మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర, బ్రాంచ్ నాయకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు జెన్కో, ట్రాన్స్కోల నుండి సింగరేణికి రావాల్సిన సుమారు 59 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, సింగరేణికి వచ్చిన లాభాలను ప్రకటించి కార్మికులకు 40 శాతం వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సింగరేణికి ఎలాంటి బకాయిలు లేకపోయినా, ప్రత్యేక రాష్ట్రంలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల సుమారు 26 వేల కోట్ల రూపాయలు బకాయిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం సింగరేణి విషయంలో జోక్యం చేసుకుంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా వ్యవహరించడంతో సింగరేణి బకాయిలు 59 వేల కోట్లకు పెరిగాయి.
కంపెనీలో కొత్త యంత్రాలు, స్పేర్ పార్ట్స్ కొనడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సేఫ్టీ షూలు, డ్రెస్సులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే, కార్మిక సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న క్వార్టర్లకు కనీస మరమ్మత్తులు చేయకుండా, కాలనీలోని రోడ్లు పాడైపోయినా వాటిని బాగుచేయకుండా యాజమాన్యం జాప్యం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ అన్నా రావు, కాంట్రాక్టు వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు బుర్ర తిరుపతి, పిట్ సహాయ కార్యదర్శి కావేరీ రాకేష్, నాయకులు ఎర్రల విజయ్, అజయ్ రెడ్డి, మాధవ్ మహేష్, సేఫ్టీ కమిటీ సభ్యుడు మోహన్, క్లబ్ కమిటీ ఇన్చార్జ్ చోప్పారి సురేందర్, బుచిరాజం, వినయ్రాజ్, సాయి, రాజేష్, ఎజ్జా రాకేష్, ఎం. తిరుపతి, జి. తిరుపతి, ప్రశాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












