కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నిరూపిస్తే బహిరంగంగా సవాల్ విసురుతామని సంఘం వెల్లడి
సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డిని, సీఐటీయూ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, గుర్తుతెలియని శక్తులు సోషల్ మీడియా వేదికగా అసత్యాలతో కూడిన తప్పుడు పోస్టర్లను సృష్టించి, వాట్సాప్ మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని ఆర్జి-టు బ్రాంచ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు ఆర్జి-టు ఏరియా సమావేశంలో బ్రాంచ్ సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని వర్తింపజేయాలనే లక్ష్యంతో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్షలు, సింగరేణిలో సొంతింటి కలను నెరవేర్చడం కోసం కార్మిక అభిప్రాయ సేకరణ కొరకు సింగరేణి వ్యాప్తంగా కొత్త క్వార్టర్లు నిర్మించాలా లేక సొంత ఇల్లు కావాలా అని బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించి సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కార్మికుల ప్రయోజనం కోసం రామగుండం శాసనసభ్యులతో పాటు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఈ పథకం అమలుపై సమగ్ర మెమోరండంలు సమర్పించి, అనేక సుదీర్ఘ ఉద్యమాలు చేశారు. దీని ఫలితంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన రావడంతో, కొందరు ఇతర యూనియన్ నాయకులు ఓర్వలేక సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్మికులకు మేలు జరిగే విధానాలపై ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఒప్పించడాన్ని అమ్ముడుపోవడం అని చిత్రీకరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని చేస్తున్న నిరాధార ఆరోపణలు కేవలం సీఐటీయూ వృద్ధిని, నిజాయితీని చూసి తట్టుకోలేక చేస్తున్న కుట్ర మాత్రమేనని, ఈ ఆరోపణలను నిరూపించే ధైర్యం ఉంటే ప్రెస్ మీట్‌కు వచ్చి బహిరంగంగా రుజువు చేయాలని సవాల్ విసురుతున్నామని అన్నారు.
నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న శక్తులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దుష్ప్రచారానికి బాధ్యులైన వారిపై, వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం, సంక్షేమం కోసం నిరంతరం పోరాడే సీఐటీయూపై ఇటువంటి చౌకబారు ఆరోపణలను సింగరేణి కార్మికులు ఎవరూ నమ్మరని, సొంత ఇంటి పథకంపై సీఐటీయూ చేస్తున్న పోరాటాలను కార్మికులు గమనిస్తున్నారని, ఇట్టి ఆరోపణలు చేసేవారికి కార్మికులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బానోతు వినయ్, ఓసిపి-త్రి పిట్ సెక్రెటరీ రాంప్రసాద్, వినేష్, సాంబారావు, వకీల్ పల్లి ఫిట్ సెక్రెటరీ తిరుపతి, రాజశేఖర్, శ్రవణ్, రాజేష్, జగదీష్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.












