గోదావరిఖని, 10 October
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ. 56,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
సింగరేణి సంస్థను ఆర్థికంగా దోపిడీ చేస్తూ, కార్మికుల రక్తాన్ని తాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని అరికట్టాలని, సింగరేణి లాభాల్లో 36 వాటాను వెంటనే చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా లాభాలు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని, ఇతర సమస్యలపై శనివారం రామగుండం-2 ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల వారీగా ఫ్లకార్డులతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల కష్టాన్ని పీక్కుతింటూ, ప్రాణాలను పణంగా పెట్టి వెలికితీస్తున్న బొగ్గు సొమ్మును అనుభవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సీఐటీయూ తీవ్ర స్థాయిలో మండిపడింది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మరియు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంఘమైన ఐఎన్టియుసి మౌనం వహించడంపై, ఇట్టి దిగజారిన తీరుపై నిలదీస్తూ, సంస్థకు ఉత్పత్తి పెరిగినప్పుడు, రికార్డు స్థాయిలో బొగ్గు తీస్తున్నప్పుడు ఇన్సెంటివ్‌లు ఎటుపోయాయని, ప్లేడే పీహెచ్‌డీల పైన నిబంధనలను ఎత్తివేసి పూర్తిస్థాయిలో ఇస్తామని ఇచ్చిన హామీని మరిచారని విమర్శించారు. కొత్త డంపర్లు, డోజర్లు, డ్రిల్ మిషనరీలు మరియు మిషనరీ మెయింటెనెన్స్ వ్యానులు కొనుగోలు చేయకుండా, కార్మికులు పని చేయడం లేదని అబండాలు మోపడం సరికాదని హెచ్చరించారు. సేఫ్టీ మీటింగ్‌లు పెడుతున్నారు సరే, మరి ఆ సేఫ్టీ మినిట్స్ నోటీస్ బోర్డులపై ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. కార్మికుల భద్రతను గాలికొదిలేసి, ప్రశ్నిస్తే మొద్దునిద్ర పోయే ఇట్టి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు, ప్రభుత్వానికి కార్మికుల గోడు పట్టడం లేదని మండిపడ్డారు. సీఎం పీఎఫ్ బ్యాలెన్స్‌లు అప్డేట్ చేయట్లేదని, చిట్టీలు ఇవ్వట్లేదని, కార్మికులు తమ నెత్తురు మరిగించి సంపాదించుకున్న డబ్బుల కోసం పోరాడాల్సి వస్తోందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ. 56,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లిస్తేనే, ఆ డబ్బులతో కొత్త మిషనరీ, రక్షణ పరికరాలు, నాణ్యమైన బూట్లు, హెల్మెట్లు కొనుగోలు చేయడానికి వీలవుతుందని, లేదంటే కార్మికులే సొంత డబ్బులతో కొనుక్కునే దుస్థితి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు.
గుర్తింపు, ప్రాథమిక సంఘాల ద్రోహపూరిత వైఖరి మానుకోవాలని, కార్మికుల హక్కులను తాకట్టు పెడుతున్న ఈ సంఘాల తీరును సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఒకవైపు లేబర్ కోడ్స్‌తో కార్మిక సంఘాలను, కార్మికులను ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి తరుణంలో, సంస్థలను కాపాడాల్సిన కార్మిక సంఘాలే సంస్థ ఉనికిని ప్రశ్నార్థకంగా చేస్తూ, కార్మికుల హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు. కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రమే లేబర్ కోడ్స్‌ను పూర్తిస్థాయిలో వ్యతిరేకించారని, మన తెలంగాణ గడ్డపై మాత్రం అవే లేబర్ కోడ్లను పరోక్షంగా అమలు చేస్తూ కార్మికుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే ఈ కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కదలిరావాలని పిలుపునిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలని కోరుతూ, గత ఆర్థిక సంవత్సర లాభాలను తక్షణమే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన 36 లాభాల వాటాను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ. 56,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సేఫ్టీ కమిటీ మీటింగ్ మినిట్స్‌ను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని, పీఎంఈ పేరుతో మెడికల్ బోర్డుల వేధింపుల సర్క్యులర్లను రద్దు చేసి, గతంలో మాదిరిగా కొనసాగించాలని, 150 మస్టర్ల నిబంధనకు సంబంధించిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని, ఐడీఈ నిబంధనల ప్రకారం అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, సీఎం పీఎఫ్ బ్యాలెన్స్‌లను వెంటనే ఆన్లైన్లో అప్డేట్ చేసి చిట్టీలు అందించాలని కోరారు. నాణ్యమైన సేఫ్టీ పరికరాలు, బూట్లు సరఫరా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికైనా కళ్లు తెరిచి కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో కార్మిక లోకం తిరగబడి తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఓసిపి-3 పిట్ సెక్రటరీ రాంప్రసాద్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు వినేష్, సాంబరావు, రాజేందర్, భూమయ్య తో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












