గుడుంబా తయారీకి వాడే బెల్లం పానకం ధ్వంసం, వాహనాలకు జరిమానాలు
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేకే నగర్ ప్రాంతంలో గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతంలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గుడుంబా తయారీకి ఉపయోగించే 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో 50 ద్విచక్ర వాహనాలను పరిశీలించి, నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ రావు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, సరఫరా, అక్రమ రవాణా, విక్రయం, సేవనం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. గంజాయి, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్క్రాప్ దొంగతనాలు, పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల చోరీలు, దొంగిలించిన స్క్రాప్‌ను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలను భయాందోళనలకు గురిచేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలు, డయల్-112 సేవలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపులో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, ప్రతి కాలనీ, నివాస ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతలను పరిరక్షించడం, పోలీసులకు మరియు ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని సీఐ తెలిపారు.












