పెద్దపల్లి, 2026-10-12
ఇళ్ల భద్రత, పిల్లల రక్షణ, సైబర్ భద్రతపై ప్రజలకు సూచనలు
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్ల భద్రత, పిల్లల రక్షణ, సైబర్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ . ప్రసాద్ రావు సూచించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని ఆయన కోరారు.
ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
దసరా సెలవులకు సొంత ఊర్లకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా తాళం వేసి ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. బతుకమ్మ ఆడేందుకు లేదా ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఇంటి భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలను బహిరంగంగా కనిపించే ప్రదేశాల్లో ఉంచకూడదు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని తెలియని వ్యక్తులకు తెలియజేయకూడదు. అనుమానాస్పద వ్యక్తులు, నంబర్ ప్లేట్ లేని వాహనాలు లేదా అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. కాలనీలు, అపార్ట్మెంట్లు, వీధుల్లో నివసించే ప్రజలు పరస్పరం అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కదలికలను పోలీసుల దృష్టికి తీసుకురావాలి. సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ గడియ వేయాలి. ఇంటిముందు, ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
దసరా సెలవుల సమయంలో పిల్లలు స్నేహితుల ఇళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్తామని చెప్పి ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ సూచించారు. మైనర్ పిల్లలకు బైకులు, కార్లు ఇవ్వకూడదు. పిల్లల ఒత్తిడికి లొంగి వాహనాలు అప్పగించడం వారి ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరం. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ ఉంచాలి. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగం, రహదారి భద్రతపై పిల్లలకు అవగాహన కల్పించాలి. మైనర్ల వాహన వినియోగాన్ని ప్రోత్సహించకుండా బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా వ్యవహరించాలి.
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిఘా
సెలవుల సమయంలో పిల్లలు ఎక్కువ సమయం సెల్ఫోన్లతో గడపకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. సోషల్ మీడియా వేదికలపై వ్యక్తిగత ఫొటోలు, కుటుంబ వివరాలు, ఇంటి చిరునామా, ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని బహిరంగంగా పోస్ట్ చేయకుండా పిల్లలకు సూచించాలి. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించడం, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, ఫైల్స్‌ను తెరవకూడదు. లు, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోలను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి, నకిలీ ఖాతాల ద్వారా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున వ్యక్తిగత ఫొటోల షేరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో ఎవరైనా బెదిరించినా, వేధించినా లేదా అనుమానాస్పదంగా ప్రవర్తించినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలి. పిల్లలకు ఇంటర్నెట్ భద్రతపై అవగాహన కల్పిస్తూ, వారి ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు బాధ్యతాయుతమైన పర్యవేక్షణ కొనసాగించాలి.












