రామగిరి, 4 November
భజనలు, అన్నదానం, వృద్ధులకు దుప్పట్లు, పేదలకు నిత్యావసరాల పంపిణీ
లోకానికి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ మానవ విలువలను బోధించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, మండలం కల్వచర్ల గ్రామంలో బుధవారం ఆయన 101వ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముందస్తు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. కల్వచర్ల శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్, సింగరేణి రిటైర్డ్ అధికారి నూక రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలో పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు జరిగాయి.
కల్వచర్ల మెయిన్ రోడ్డులోని నూక రమేష్ స్వగృహం సాయి నిలయం వేదికగా, భక్తులు, సేవాదళ్, శ్రీశివరామకృష్ణ భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 101 సత్యసాయి భజనల కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి నామస్మరణతో కల్వచర్ల గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. భజన కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ, టిఫిన్, భోజన వసతులను నూక రమేష్ దంపతులు ఏర్పాటు చేశారు.
విస్తృత సామాజిక సేవలు
భజనల అనంతరం ప్రతి నెలా నిర్వహించే నారాయణ సేవలో భాగంగా ఐదుగురు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో కూడిన అమృత కలశం సంచులను అందజేశారు. అలాగే, రాబోయే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని 21 మంది వృద్ధులకు చలి నుంచి రక్షణ కోసం దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కన్వీనర్ నూక రమేష్ మాట్లాడుతూ, ఈనెల 23వ తేదీన స్వామివారి పవిత్ర జన్మదినం రోజున తాను పుట్టపర్తి క్షేత్రానికి వెళ్తున్నందున, ఈ వేడుకలను ముందస్తుగా నిర్వహించినట్లు తెలిపారు. లబ్ధి పొందిన వృద్ధులందరూ స్వామివారి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి నెలా నిరుపేదలకు అందుతున్న ఈ సాయంపై లబ్ధిదారులు స్పందిస్తూ, నూక రమేష్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమ విశేషాలు
ఈ కార్యక్రమాలలో డాక్టర్ యం.హరికృష్ణ (పూర్వ కరీంనగర్ సత్యసాయి సేవాసమితి కన్వీనర్), సింగరేణి డీజీయం పెరుమాల్ శరవణన్, మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా అమృత కలశం సంచులను అందజేశారు. కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా సత్యసాయి ఆధ్యాత్మిక సమన్వయకర్త క్యాతం రాజేశం, 8వ కాలనీ కన్వీనర్ కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, భజన మండలి ఇంచార్జి పారిపెల్లి మల్లయ్య, కరీంనగర్ సభ్యులు రాంరెడ్డి, కల్వచర్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి రేండ్ల శారద, మాజీ సర్పంచ్ రేండ్ల అశోక్, సత్యసాయి సేవాదళ్ సభ్యత్వ దంపతులు గరిగంటి రాజం, గుండ శంకరయ్య, పుల్లూరి అన్వేష్, కొండ సమ్మయ్య, కందికట్ల భాస్కర్ దంపతులతోపాటు శివరామకృష్ణ భజన మండలి సభ్యులు వొడితెల శ్రీనివాస్, బర్ల సత్యనారాయణ, రేండ్ల రమేష్, గంట మధుసూదనరెడ్డి, తాటి రవీందర్, వేగోలపు కృష్ణస్వామి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.












