11 రోజుల పాటు అమ్మవారికి విశేష అలంకరణలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, చండీ హోమం
పెద్దపల్లి జిల్లా మండలం సెంటినరీ కాలనీ సమీపంలోని సింగరేణి ఆర్జీ3 ఓసీ1 ఫేస్2 ఆవరణలో గల తెలంగాణలోనే రెండవ భద్రకాళీ ఆలయమైన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మరియు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయసారథి పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ 11రోజుల ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి వివిధ రూపాలలో విశేష అలంకరణలు, వైభవంగా అభిషేకాలు, కుంకుమార్చనలు మరియు నిత్య పూజలు నిర్వహించనున్నారు. వీటితో పాటు ఆలయ ఆవరణలో చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణలు శాస్త్రోక్తంగా జరుగుతాయని, అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగదేవత మంటపాల వద్ద కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ప్రధాన అర్చకులు పేర్కొన్నారు.
ఆలయ కమిటీ నిర్వాహకుల సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ శరన్నవరాత్రి వేడుకలకు విచ్చేసే భక్తులందరికీ నిత్యం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కావున పరిసర ప్రాంతాల నుండే కాక రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని శ్రీ భద్రకాళీ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సముద్రాల విజయసారథి భక్తులకు పిలుపునిచ్చారు.




