పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవకు పెద్దపీట వేస్తూ, పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 134 యూనిట్ల రక్తాన్ని సేకరించగా, సుమారు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మహిళలకు చీరల పంపిణీ, గ్రామీణ యువతకు వాలీబాల్ కిట్లు, డ్రైవర్లకు ఉచిత డ్రైవింగ్ లైసెన్సుల కల్పనకు పోలీసుల ప్రత్యేక చొరవ చూపారు.
పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవకు పెద్దపీట వేస్తూ, పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 134 యూనిట్ల రక్తాన్ని సేకరించగా, సుమారు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మహిళలకు చీరల పంపిణీ, గ్రామీణ యువతకు వాలీబాల్ కిట్లు, డ్రైవర్లకు ఉచిత డ్రైవింగ్ లైసెన్సుల కల్పనకు పోలీసుల ప్రత్యేక చొరవ చూపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని, సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవా స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపీఎస్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చెన్నూరు రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఈ మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు.
చెన్నూరు రూరల్ సర్కిల్ కార్యాలయ ఆవరణతో పాటు పోలీస్ స్టేషన్ వేదికగా నిర్వహించిన ఈ సామాజిక సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపీఎస్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ అధికారులు వారి అంకితభావాన్ని కొనియాడారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారు చూపిన ధైర్యం, కర్తవ్యనిష్ఠ, సేవా స్ఫూర్తి ప్రతి పోలీస్ అధికారికి ఆదర్శమని తెలిపారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి యువత, స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, ఇతర అనారోగ్య సమస్యల సమయంలో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆరోగ్యపరంగా అర్హులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసుల పిలుపునకు స్పందించిన యువకులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా రక్తదానం చేయగా, ఈ శిబిరంలో మొత్తం 134 యూనిట్ల రక్తాన్ని సేకరించడం విశేషం. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఈ రక్తం ఉపయోగపడనుంది. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన దాతలను అధికారులు అభినందించారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, సమయానికి కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.











