ప్రమాదం
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన మండలం మల్లుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. మృతుడిని మల్లుపల్లి గ్రామానికి చెందిన కొమ్ము స్వామి (35)గా గుర్తించారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే స్వామి, అప్పుడప్పుడు చేపల వేటకు వెళ్తుండేవాడు. సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు.
మంగళవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో నాగంపేట గ్రామానికి చెందిన నర్ర రాజిరెడ్డి తన వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి నీటిలో పడి మృతి చెంది తేలుతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో మృతుడి సోదరుడు కొమ్ము రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పరిశీలించగా అది కొమ్ము స్వామి గా గుర్తించారు. చేపల వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయ బావిలో పడటంతో నీటిలో ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామి మృతిపై తమకు ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.










