ప్రమాదం
సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం, శంకర్ నగర్ గ్రామ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు లారీ డ్రైవర్లు రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన లారీ డ్రైవర్లు చతిస్గడ్ రాష్ట్రానికి చెందినవారిగా ప్రాథమిక సమాచారం. వారి మృతదేహాలను బెజ్జంకి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై బెజ్జంకి పోలీసులు మాట్లాడుతూ, రహదారిపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూసుకుని జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు.










