కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పేదలకు నష్టం కలిగిస్తుందని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
కల్యాణలక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన పేద కుటుంబాల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
ఆడబిడ్డల సంక్షేమానికి అండగా నిలిచిన పథకాలను కొనసాగించాల్సింది పోయి, వాటి అమలుపై నిర్లక్ష్య ధోరణి అవలంబించడం పేద ప్రజలకు నష్టం కలిగిస్తుందని ఆయన అన్నారు. కల్యాణలక్ష్మి వంటి పథకాలను మరింత బలోపేతం చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందించాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కేసీఆర్ హయాంలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు, బీఆర్ఎస్ నాయకురాలు మూల విజయ రెడ్డి, మురళీధర్ రావు, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, కార్పొరేటర్ కర్క పద్మజ శ్రీనివాస్, పోగుల వకుళ, సత్యవతి, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












